అనకాపల్లిలో 'ఆపరేషన్ కేజ్'.. పులిని బంధించేందుకు ప్రయత్నాలు
'Operation Cage' launched to trap big cat at Anakapalli. విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో గత వారం రోజులు నుంచి బీభత్సం సృష్టిస్తోన్న పులిని పట్టుకునేందుకు
By అంజి
విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో గత వారం రోజులు నుంచి బీభత్సం సృష్టిస్తోన్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ 'ఆపరేషన్ కేజ్'ను ప్రారంభించింది. ఆదివారం తెల్లవారుజామున బౌలవాడ గ్రామంలో పెద్దపులి ఓ దూడను చంపేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. దీంతో అటవీ శాఖ పులిని పట్టుకునేందుకు బౌలవాడ శివారులో బోనును ఉంచింది.
అనకాపల్లి జిల్లా కశింకోట మండల పరిధిలోని విస్సన్నపేటలో రెండ్రోజుల క్రితం పులి దూడను చంపిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. రెండు కెమెరా ట్రాప్‌లు దూడ కళేబరం దగ్గర పులి కదలికను బంధించాయి. ఇది నాలుగేళ్ల మగపులి అని అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున బౌలవాడ వద్ద పులి ఒక దూడను చంపినట్లు తమకు సమాచారం అందిందని పెందుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి రామారావు తెలిపారు.
"మా బృందాలు సంఘటనా స్థలాన్ని సందర్శించి పాదముద్రలను కనుగొన్నాయి. బౌలవాడకు 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలను మేము అప్రమత్తం చేసాము. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము వారికి తెలియజేసాము" అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారిగా పులి కనిపించింది. అనంతరం పెద్దపల్లె, ఎలమంచిలి, కోటౌరట్ల, కశింకోట మీదుగా అనకాపల్లి మండలానికి చేరుకుంది. "పెద్ద పులిని ట్రాప్ చేయడానికి మేము ఆదివారం సాయంత్రం బౌలవాడ శివార్లలో బోనును ఏర్పాటు చేసాము" అని రావు తెలిపారు.
బోను గేటు ఆటోమేటిక్‌గా పని చేస్తుందని అటవీ అధికారులు తెలిపారు. "పులి బోనులోకి ప్రవేశించిన తర్వాత, తలుపు మూసివేయబడుతుంది." అని వారు చెప్పారు. భారీ వర్షాల కారణంగా పాదముద్రలు కొట్టుకుపోవడంతో శుక్ర, శనివారాల్లో పులి సంచారాన్ని గుర్తించలేకపోయామని అధికారులు తెలిపారు. "బౌలవాడలో పులి సంచరిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. అది దూడ శవాన్ని వదిలి వెళ్లిన ప్రదేశానికి మళ్లీ వచ్చి ఉండవచ్చు" అని అటవీ అధికారులు తెలిపారు.