స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవిత ఖైదు పడ్డ 175 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. హోమ్ శాఖ కార్యదర్శి హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా పలు జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జైళ్లలో ఉన్న ఖైదీల శిక్షను తగ్గించాలని కేంద్రం గతంలోనే తెలిపింది. 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖైదీలకు శిక్ష తగ్గించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. జైళ్లలో వారి ప్రవర్తనను బట్టి మాత్రమే శిక్ష తగ్గింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. మొత్తం శిక్షాకాలంలో సగంపైన పూర్తి చేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువఖైదీలపై ఎలాంటి ఇతర క్రిమినల్ కేసులు లేకుండా, వారు 50శాతం శిక్షాకాలం పూర్తి చేసుకుంటే వారిని కూడా పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం పంపింది. శిక్షాకాలం పూరైనప్పటికీ కోర్టు విధించిన జరిమానాలు కట్టలేక జైళ్లలోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు వారి జరిమానాలను రద్దు చేశారు. కేంద్రం నిర్దేశించిన అర్హతలు ఉన్న ఖైదీలను 3 విడతల్లో విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
ఈ ఏడాది ఆగస్టు 15న కొందరిని, వచ్చే ఏడాది జనవరి 26 మరికొందరిని, 2023 ఆగస్టు 15న మరికొందరిని మొత్తం మూడు విడతల్లో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సమాచారం ఇచ్చింది. అందులో భాగంగా ఏపీలో ఈ ఏడాది 175 మంది ఖైదీలను విడుదల చేశారు.