అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ
ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 8:32 AM GMTఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లల్లో జగన్ నువ్వు ఏమి చేశావో చెప్పు, ఇప్పుడు మాట్లాడేదానిలో ఏమైనా అర్దం ఉందా అని ఫైర్ అయ్యారు. అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ.. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించి.. ఐపీసీ సెక్షన్లు తొలగించి.. వైసీపీ సెక్షన్లు అమలు చేసింది మీరన్నారు.
నేడు చట్టాల గురించి జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 151స్థానాలు ప్రజలు ఇస్తే, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అరాచకాలు చేశావు అన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి పని ప్రారంభించకముందే రాష్ట్రపతి పాలన అంటూ ఢిల్లీ పరుగెత్తావు అన్నారు. మీ 420 టీం మొత్తాన్ని నడిపించిందే నువ్వే కదా సజ్జల రామకృష్ణారెడ్డే అన్నారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. దాడి చేయించింది నువ్వే కదా సజ్జల అన్నారు. సీఎం జగన్ ను నడిపించిందే నువ్వు అనే విషయం అందరికీ తెలుసు అన్నారు. 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కాపీలు పంపిస్తే.. మీ ప్యాలెస్ మొత్తం మునిగిపోతుందన్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని.. అక్రమంగా పాలన సాగించారన్నారు. ముంబై నటి వ్యవహారంలో మీ తప్పు లేకుంటే.. మీ పేర్లే ఎందుకు వచ్చాయి అన్నారు. ముగ్గురు ఐపీయస్ అదికారులు నీ మాటలు నమ్మి.. ఇప్పుడు శిక్ష అనుభవించే పరిస్థితికి వచ్చారన్నారు. మేము రామ రాజ్యం కోసం పని చేస్తున్నాం.. మీరు రావణ రాజ్యం కోసం పాలన చేశారు. చివరకు ఇంట్లో ఉండే మహిళా కుటుంబ సభ్యులను కూడా వదలకుండా తిట్టించారు అన్నారు. మీలాంటోళ్లకు కఠినంగా శిక్షిస్తేనే.. ఇంకోసారి బూతులు తిట్టాలంటే భయపడతారన్నారు.
జగన్ జామానాలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూని అయ్యిందన్నారు. వరదల వల్ల ప్రజలు అల్లాడుతుంటే.. జగన్ వచ్చి బురద రాజకీయం చేశారన్నారు. కోటి రూపాయలు సాయం అన్న జగన్.. ఎవరికి ఇఛ్చారో చెప్పాలన్నారు. జగన్ పాలనలో ఎపీ అన్ని విధాలా నాశనం అయ్యింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అభివృద్ది పధంలో తీసుకు వెళ్లాలని పని చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే.. చూస్తూ ఊరుకోం.. ఇక నుంచి నోటికొచ్చినట్లు వాగితే.. చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదన్నారు.