దాదాపు 100 టన్నుల బరువున్న ఓ పురాతన చెక్కపెట్టె అలల మధ్య విశాఖ తీరానికి కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. వారు వెంటనే పోలీసులకు పెట్టె గురించిన సమాచారం ఇచ్చారు. పెట్టె ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ప్రొక్లెయిన్ సాయంతో పెట్టెను బయటకు తీసుకొచ్చారు. పెట్టె చూసేందుకు భారీగా ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో పెట్టెను తెరవనున్నారు.
విశాఖ బీచ్‌లో ఉన్న ఈ చెక్క పెట్టెను చూడటానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఆ పెట్టెలో ఏముందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ పెట్టె ఎక్కడనుంచి కొట్టుకొచ్చింది? ఆ పెట్టెలో ఏముంది? వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు తలెత్తున్నాయి. పెట్టె రహస్యం, అందులో ఏముందనేది త్వరలోనే అర్కియాలజీ విభాగం అధికారులు.. ఆ పెట్టె తెరిచిన తర్వాత పరిశీలించి చెప్పనున్నారు. గతంలో కూడా కొన్ని వస్తువులు విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.