సాధారణంగా ఎక్కడైన ప్రమాదం జరిగితే స్థానికులు అక్కడకు వెళ్లి సహాయక కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు యత్నిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు ప్రమాదానికి గురైన వాహనంలోని సరుకు బట్టి కూడా మనుషుల ధోరణి మారిపోతుంటుందని గతంలో కొన్ని ఘటనల్లో చూశాం. మద్యం లోడులో వెలుతున్న వాహనం బోల్తా పడితే డ్రైవర్ కి సాయం చేయాల్సింది పోయి అందినకాడికి మందు బాటిళ్లను ఎత్తుకు పోయిన ఘటనలు చూశాం.తాజాగా అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ ఒకటి నకరికల్లు మండలం చల్లగుండ వద్ద నార్కట్ పల్లి - అద్దంకి హైవే పై బోల్తా పడింది. ఈ విషయం క్షణాల్లో సమీప గ్రామాల ప్రజలకు తెలిపింది. వెంటనే వారు వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. బిందెలు, బకెట్లు, క్యాన్లు ఇలా ఏది దొరికితే అది పట్టుకుని ఆడ, మగ అనే తేడాలేకుండా అందరూ ఆయిల్ నింపుకోవడానికి ఎగబడ్డారు. దీంతో హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.