ఏపీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి సీసీఎల్‌ఏ ఆఫీసులో రెవెన్యూ శాఖపై శుక్రవారం నాడు ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఏ సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు.
ప్రజల అర్జీలను పరిష్కరించడంలో.. అలసత్వంగా పని చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్‌పైన పరిగెడితున్నట్లు ఉందని, అందుకే అక్కడే ఉంటున్నారని సిసోడియా విమర్శించారు. నిన్న కేబినెట్ భేటీలో రెవెన్యూ శాఖలో అర్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.