విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: డిస్కంలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిస్కంలు బిగ్ రిలీఫ్‌ని ఇచ్చాయి. వచ్చే సంవత్సరం ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తెలిపాయి.
By అంజి Published on 2 Dec 2023 11:08 AM ISTవిద్యుత్ ఛార్జీల పెంపు లేదు: డిస్కంలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిస్కంలు బిగ్ రిలీఫ్‌ని ఇచ్చాయి. వచ్చే సంవత్సరం ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తెలిపాయి. రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, అయినప్పటికీ ఛార్జీల భారం వేయమని డిస్కంలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, 2024–2029 నియంత్రణ కాలానికి సంబంధించి నెట్‌వర్క్ ఆదాయ అవసరాల నివేదికలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఇంధన శాఖ శుక్రవారం వెల్లడించింది. తక్కువ ధరలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ఏఆర్‌ఆర్‌లలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదని వివరించింది. 2024 - 25లో అన్ని వర్గాలకు 83,118 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, కొనుగోలుకే రూ.39,017 కోట్ల ఖర్చు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి.
అది కాకుండా ట్రాన్స్‌మిషన్ అండ్ లోడ్ డిస్పాచ్ ఖర్చు రూ.5,722.88 కోట్లు, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్ ధర రూ.9,514.42 కోట్లు, ఇతర ఖర్చులు రూ.2,321.13 కోట్లుగా పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. దీని ప్రకారం మొత్తంగా రూ.56,576.03 కోట్ల రాబడి అవసరమని నివేదించాయి. అయితే అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.42,697.92 కోట్లు మాత్రమే వస్తున్నాయని.. దీంతో రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించాయి. అయినప్పటికీ ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం ప్రజలపై చార్జీల భారం మోపాలనుకోవడం లేదని ఏపీఈఆర్‌సీకి డిస్కంలు నివేదించాయి.