AP: నో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఇక బ్రాండెడ్ లిక్కరే
ఆంధ్రప్రదేశ్‌లో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, నెపోలియన్, బ్లాక్ బస్టర్, స్పెషల్ స్టేటస్, లెజెండ్ లాంటివి ఇకపై దొరకవు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2024 10:29 AM ISTనో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఇక బ్రాండెడ్ లిక్కరే
ఆంధ్రప్రదేశ్‌లో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, నెపోలియన్, బ్లాక్ బస్టర్, స్పెషల్ స్టేటస్, లెజెండ్ లాంటివి ఇకపై దొరకవు. అక్టోబర్ 1 నుంచి వైన్ షాపుల్లో బ్రాండెడ్ మద్యం మాత్రమే విక్రయించనున్నారు. అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త మద్యం పాలసీ ద్వారా నకిలీ బ్రాండ్లకు స్వస్తి పలకనుంది.
రాష్ట్రంలో నాణ్యమైన బ్రాండ్‌లను అందుబాటులో ఉంచేందుకు మంచి మద్యం పాలసీల గురించి అధ్యయనం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె. రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలోని లోకల్ బ్రాండ్‌లను ప్రముఖ కంపెనీలతో భర్తీ చేయనున్నారు. 2014- 2019 మధ్య కాలంలోని టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ వ్యాపారంగా మాత్రమే పరిగణించింది, దీంతో దేశవ్యాప్తంగా దొరికే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2019లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసిందని ఆరోపించారు. ఇది వినియోగదారుల ప్రాణాలకు హాని కలిగించే స్థాయికి కూడా వెళ్లిందని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నప్పుడు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి కేవలం నగదు రూపంలో మాత్రమే మద్యం అమ్మకాలను చేసినట్లు ఆరోపించారు. "వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్‌లను ఎంచుకునే లగ్జరీని కోల్పోయారు, అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్‌లను మాత్రమే కొనుగోలు చేసేలా బలవంతం చేశారు" అని మంత్రి ఆరోపించారు.
మద్యం కొత్త బ్రాండ్లు:
YSRCP ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో అనేక ప్రముఖ విస్కీ, బీర్ బ్రాండ్లు అందుబాటులో లేవు. బ్లాక్ బస్టర్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, లెజెండ్, పవర్ స్టార్ 999, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ వంటి ఆసక్తికరమైన పేర్లతో బ్రాండ్‌లు వైన్ షాపుల్లో లభించేవి. వీటిని సోషల్ మీడియాలో జె-బ్రాండ్స్ (జగన్ బ్రాండ్స్) అని పిలుస్తారు.
ఈ మద్యం బ్రాండ్‌లన్నీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలవేనని టీడీపీ, బీజేపీ పార్టీలు పలు సందర్భాల్లో ఆరోపించాయి.
2023లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) 16 కంపెనీల నుండి 74 శాతం మద్యం కొనుగోలు చేస్తోందని, 100-ప్లస్ రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్లు, ఇవన్నీ YSRCP నాయకులతో ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రానికి మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీల యజమానుల పేర్లను కూడా వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే, టీడీపీ ఆరోపించిన బ్రాండ్లన్నీ టీడీపీ హయాంలో ప్రవేశపెట్టినవేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో వివరించారు. మద్యం బ్రాండ్‌లపై వైజాగ్‌కు చెందిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్లలో ‘జగన్ బ్రాండ్స్’గా పిలిచే లోకల్ బ్రాండ్‌లను ఎక్కువగా చూశాం.. ముఖ్యంగా బీర్ బ్రాండ్‌లకు సంబంధించి బ్లాక్ బస్టర్, బూమ్ బూమ్ మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మేము వైన్ షాపుల్లో కార్ల్స్‌బర్గ్, హెనికెన్, కరోనా, హోగార్డెన్ వంటి బీర్ బ్రాండ్‌లను కొనలేకపోయాము" అని తెలిపాడు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విక్రయాలపై సీఐడీ విచారణ:
జూలై 2024లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని ప్రకటించారు.
గత ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రాన్ని సమర్పించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సిపి మొదట రిటైల్ మద్యం దుకాణాలను 4,380 నుండి 2,934 కు తగ్గించిందని అన్నారు. ఆ తర్వాత ఆ ఆ సంఖ్య మళ్లీ 3,392కి పెరిగిందన్నారు. బార్ల సంఖ్య కూడా 840గా ఉంది.
అధిక ధరలు - ఆరోగ్య సమస్యలు
రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మద్యం వచ్చి ధరలు పెరగడంతో.. కల్తీ మద్యంతో మరణాలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని టీడీపీ ఆరోపించింది. నివేదికల ప్రకారం గత కొన్నేళ్లుగా మద్యం వినియోగం పెరిగింది. 2019-20లో 5.55 లీటర్లు ఉన్న తలసరి వినియోగం 2023-24 నాటికి 6.23 లీటర్లకు చేరుకుంది. ఇది అక్రమ మద్యం వాడకం, నాన్-డ్యూటీ-పెయిడ్ మద్యం ప్రవాహానికి దారితీసింది. రాష్ట్రంలో మద్యం ధరలు అసాధారణంగా పెరగడంతో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా తీసుకొచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
మద్యపాన నిషేధం-- మహిళలకు ఇప్పటికీ ఒక కల:
ఇదిలా ఉండగా, మద్యానికి బానిసలైన భర్తలను చూసే చాలా మంది మహిళలకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 2019-21 మధ్య రాష్ట్రంలో మద్యం వినియోగం 11.5%, జాతీయ సగటు 9.9% కంటే దాదాపు 1.6 శాతం ఎక్కువ. మద్యం వినియోగంలో జాతీయ సగటు కంటే ఏపీ కాస్త ఎగువనే నిలిచింది.
నాణ్యమైన మద్యం ఇస్తామని, ధరలు తగ్గిస్తామన్నది టీడీపీ ఎన్నికల హామీల్లో ఒకటి. 40 రోజుల తర్వాత (టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి) నాణ్యమైన మద్యం కోసమే కాకుండా ధరలను తగ్గించే బాధ్యత కూడా తీసుకుంటామని నేను మీకు చెబుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.
గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా క్రమంగా మద్యపాన నిషేధానికి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో మద్యం మత్తులో బాధిత కుటుంబాలను పరామర్శించి మూడో దశలో ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.