అమరావతి: చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. భారీ వర్షానికి గోడ కూలినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ దుర్ఘటన బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సింహాచలం ప్రమాద ఘటనలో సహాయక చర్యలను హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షిస్తున్నారు. హుటా హుటనా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు.
అటు ఇవాళ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహాస్వామికి చందనోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్వామి వారు నిజరూపంలో దర్శనమివ్వనుండటంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.