ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అన్ని జిల్లాల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఎస్ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా రద్దైంది. వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది.