నాకు ఓటు లేదు : నిమ్మ‌గ‌డ్డ‌

Nimmagadda Ramesh Kumar Press Meet. ఏపీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ త‌న ఓటర్ గుర్తింపు కార్డుపై మాట్లాడారు.

By Medi Samrat  Published on  27 Jan 2021 3:11 PM GMT
Nimmagadda Ramesh Kumar Press Meet

ఏపీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ త‌న ఓటర్ గుర్తింపు కార్డుపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయన బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓటు విష‌య‌మై వ్యాఖ్యానించారు. తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు వుండేదని.. కానీ దానిని తాను సరెండర్ చేశానని, తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నానని ఎస్ఈసీ తెలిపారు. తనకు గ్రామంలో ఇళ్లు, పొలం, ఇతర ఆస్తులు వున్నాయని నిమ్మగడ్డ వెల్లడించారు.

హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసు వున్నప్పటికీ.. మార్చి 31 తర్వాత తాను దుగ్గిరాలకే రావాల్సి వుందన్నారు. తాను దుగ్గిరాలలో సాధారణంగా ఉండటం లేదని.. తాను ఓటు హక్కు కోసం పెట్టుకున్న దరఖాస్తును స్థానిక తహసీల్దార్ తిరస్కరించారని నిమ్మగడ్డ వెల్లడించారు. ఎలక్షన్ కమీషనర్‌గా నాకు విచక్షణాధికారాలు వున్నట్లే.. ఏ అధికారికైనా వుంటాయని వాటిని తాను గౌరవిస్తానని ఎస్ఈసీ తెలిపారు. తన ఓటు హక్కును తిరస్కరించిన అధికారులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలకు దిగలేదని.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఆర్జీ పెట్టుకుంటానని.. అక్కడా అన్యాయం జరిగితే కోర్టుకు న్యాయ‌స్థానానికి వెళ‌తాన‌ని అన్నారు.


Next Story