బ్రేకింగ్.. ఏపీలో సంక్రాంతి తర్వాతే రాత్రి కర్ఫ్యూ అమలు
Night curfew imposed after sankranti in Andhra pradesh.రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వం రాత్రి
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2022 10:18 AM GMTరాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. తాజాగా నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత సోమవారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జీవో ఇచ్చినా ఆ తర్వాత మార్పులు చేసింది. సంక్రాంతి తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది.ఈ మేరకు తొలుత జారీ చేసిన ఉత్తర్వులను సవరించి తాజాగా జీవో జారీ చేసింది.
సంక్రాంతి తరువాత అంటే జనవరి 18 నుంచి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్లకు వస్తుండడంతో కర్ఫ్యూ అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం బావించింది. ఈ మేరకు తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది.
కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపును ఇచ్చారు. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు. పబ్లిక్ గేదరింగ్స్‌కు పరిమిత సంఖ్యతో కూడిన అనుమతికి నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ గేదరింగ్స్‌కు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.