కరోనా మహమ్మారి కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన రాత్రి కర్ప్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వాడడం లాంటి నిబంధనలు యథావిథిగా అమల్లో ఉండనున్నాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గురువారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 1,501 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,98,603 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,696కి చేరింది. 1,697 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,69,169కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,59,03,366 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.