విజయవాడలో ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో సామాజిక కార్యకర్త దుడ్డు ప్రభాకర్ నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, నిషేధిత మావోయిస్టు పార్టీకి నిధులు సమకూర్చారని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. ప్రభాకర్ అతని భార్య,కుమార్తె లూనా సెంటర్ అజిత్ సింగ్ నగర్ సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పోలీసులు ఇతరులను ఇంట్లోకి అనుమతించడం లేదు. అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. స్ధానిక అరుణ్ బ్రదర్ ఫోర్స్ సాయంతో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పౌర సంఘాలు సోదాలను ఖండించాయి. ప్రభాకర్ నివాసం నుంచి ఎన్‌ఐఏ అధికారులను వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నాయకుడు కళ్యాణరావు, మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ బలగాలతో వీరి ఇళ్లను చుట్టుముట్టారు. స్థానికులను గానీ, మీడియా ప్రతినిధులను పరిసరాల్లోని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.