భక్తులకు గమనిక.. అన్నవరం గదుల కేటాయింపులో కొత్త నిబంధనలు
అన్నవరం ఆలయ గదుల కేటాయింపులో కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు ఆలయ అధికారులు.
By అంజి Published on 7 Aug 2023 6:48 AM GMTభక్తులకు గమనిక.. అన్నవరం గదుల కేటాయింపులో కొత్త నిబంధనలు
అన్నవరం ఆలయ గదుల కేటాయింపులో కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు ఆలయ అధికారులు. ఇక నుండి భక్తులు ఒకసారి గది తీసుకుంటే మళ్లీ 3 నెలల తర్వాత మాత్రమే వారికి గదులు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు మార్పులు చేశారు. ఈ నిబంధన ప్రకారం.. దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న వసతి గదిని ఒకసారి అద్దెకు తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును ఎంట్రీ చేస్తారు. దాని ఆధారంగా 3 నెలల వరకు గదులు అలాట్ కాకుండా మార్పులు చేస్తున్నారు.
ఒక ఆధార్ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపుకు అవకాశం ఉండదు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేవారు. ఇక నుంచి భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంటుంది. వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్న పూర్తి వివరాలు భక్తులు తెలుసుకునేలా కొండ కింద సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. అన్నవరం ఆలయంలో గదుల కేటాయింపులో దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలైన భక్తులకు గదులు లభించడం లేదనే విమర‌్శలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్మ ప్రచార మాసోత్సవాలను అన్నవరం దేవస్థానంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం నాడు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తూర్పు రాజగోపురం వద్ద సహస్ర దీపాలంకరణ మందిరంలో సత్యదేవుని వ్రతం చేశారు. ప్రధాన దేవాలయాల్లో ఒక్కో చోట నెల రోజుల పాటు ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి చెప్పారు.