వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది.
By Knakam Karthik
వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులు రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించడంలేదని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నూతన మోటార్ వాహన చట్ట నిబంధనల ప్రకారం ఉల్లంఘనలపై జరిమానాలు పెంచారు. ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది. ఈ క్రమంలో వాహనానికి సంబంధించి ఏదైనా సర్టిఫికెట్ జరిమానాలు విధించేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం అవుతోంది. రహదారులపై ద్విచక్ర వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, హెల్మెట్ తప్పనిసరి.
ఇన్నాళ్లు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్ , కారు నడిపేవారు సీట్లు బెల్టు పెట్టుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా వారికి వెసులుబాటు కోసం కొంత టైమ్ కూడా ఇచ్చారు. ఇకపై ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.వెయ్యి జరిమానా విధించానున్నారు. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి, డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్‌ను కూడా రద్దు చేయనున్నారు.
ఇక హైవేలపై ఓవర్ స్పీడ్ , సిగ్నల్ జంప్ , రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి కేసులలో గరిష్టంగా రూ.1000 వరకూ ఫైన్ విధించనున్నారు. ఇక, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు నేరుగా ఇంటికే చలాన్ కాపీని పంపించనున్నారు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన వేళ వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.