అమరావతి: రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్‌ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త లిక్కర్ పాలసీని రూపొందిస్తున్న ప్రభుత్వం.. మద్యం ధరలను భారీగా తగ్గించే ఆలోచనలో పడింది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80 నుంచి 90 లోపే నిర్ధారించాలని యోచిస్తోంది. అయితే మద్యం నాణ్యత విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త పాలసీ ఈ నెల చివరలో లేదా వచ్చే నెల తొలి వారం నుంచి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మద్యం పాలసీ కోసం ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు, అక్కడ అమలవుతున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయనున్నారు.