విశాఖపట్నం: దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. బైక్ కొన్న సందర్భంగా ఆనందగా గడపాల్సిన క్షణం పెడ వాల్తేరులోని ఒక కుటుంబానికి భరించలేని విషాదంగా మారింది. తల్లిదండ్రులు తమ కొడుకు కోసం కొన్న బైకే వారి హృదయ విదారకానికి కారణమైంది. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. మహారాణిపేటలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ రావు తన భార్య, కుమారుడు హరీష్ (19), కుమార్తెతో నివసిస్తున్నాడు.
ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసిన హరీష్ ఇటీవల ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. అతను ద్విచక్ర వాహనం కావాలని అడిగినప్పుడు, అతని తండ్రి మొదట ఆర్థిక ఇబ్బందులను చూపుతూ నిరాకరించాడు. అయితే, హరీష్ పట్టుబట్టడంతో చివరకు, శ్రీనివాస్ రావు తన కొడుకు కోరిక తీర్చడానికి ₹3 లక్షలు అప్పుగా తీసుకుని దసరా రోజున అతనికి కొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి హరీష్ తన స్నేహితుడు వినయ్ తో కలిసి కొత్త బైక్ పై ద్వారకానగర్ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు భోజనం కోసం బయలుదేరాడు.
భోజనం చేసిన తర్వాత వినయ్ ని ఇంట్లో దింపేందుకు వెళ్తుండగా సిరిపురం దత్త ఐల్యాండ్ సమీపంలో, అతను బైక్ పై నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన హరీష్‌ను 108 అంబులెన్స్‌లో కెజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందాడు. వెనకాల కూర్చున్న వినయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.