నెల్లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జీజీహెచ్ సూప‌రింటెండెంట్ ప్ర‌భాక‌ర్‌పై వేటు ప‌డింది. సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్ర‌భుత్వం ఆయ‌న్ను తొల‌గించింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ఆయన్ను బదిలీ చేస్తూ శ‌నివారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వేధింపులపై పూర్తి విచారణ జరిపి, పూర్తి నివేదిక ఇవ్వాలని నిన్న మంత్రి ఆళ్ల నాని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన, నివేదికను ప్రభుత్వానికి అందించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

జీజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటు బాధితురాలిని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అలాగే మరికొందరు మెడికోలు, హౌస్ సర్జన్లను కూడా విచారించారు. సంచలనం రేపిన ఆడియో గురించి కమిటీ సభ్యులు ప్రశ్నించగా.. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని సూపరింటెండెంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు విచారణ కమిటీ ముందు ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా.. లైంగిక వేధింపుల ఘటన కొన్ని నెలల క్రితం జరిగినట్లు కమిటీలు తమ విచారణలో తేల్చాయి.

తోట‌ వంశీ కుమార్‌

Next Story