ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి స్వల్ప ఊరట లభించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ పోసానికి కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు గానూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా మెుత్తం 16 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు.
మార్చి మొదటి వారంలో కృష్ణమురళిపై కేసు నమోదు కాగా, కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో ఆయన్ను హాజరు పర్చారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి పది రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.