తగ్గేదే లే.. జగన్‌కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని అన్నారు.
By అంజి Published on 8 March 2024 7:45 AM GMTతగ్గేదే లే.. జగన్‌కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన 'శంఖారావం' సభలో లోకేష్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు భూంభూం, ప్రెసిడెంట్ మెడల్ కావాలేమో.. టీడీపీ కార్యకర్తలకు మాత్రం పార్టీ అధ్యక్షుడి పిలుపు 'రా.. కదలిరా' అంటే తరలివస్తారని అన్నారు.
2014లో పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్న లోకేష్.. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. పలువురు కార్యకర్తల పిల్లల్ని తన తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారని, తనకు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు.. కానీ ఎన్టీఆర్ తనకు 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారని అన్నారు. తనపై 22 కేసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారని అన్నారు. తగ్గేదే లేదని.. జగన్‌కు ఆనాడే చెప్పానన్నారు.
చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయన్నారు. తాము ప్రజాధనాన్ని లూటీ చేయలేదని, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదన్నారు. తాము పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులం కాదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయన ఒక అన్నగా నిలబడతానని తనకు చెప్పారని తెలిపారు. ఆరోజు పవన్ విమానంలో రావాలంటే అనుమతి ఇవ్వలేదని, రోడ్డు మార్గంలో అడ్డుకున్నారని, అందుకే టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని ఆయన నిర్ణయించుకున్నారని లోకేశ్ అన్నారు.