'వైసీపీ సర్కార్‌ నా కుటుంబాన్ని వేధిస్తోంది'.. అమిత్‌ షాకు లోకేష్‌ ఫిర్యాదు

నారా లోకేశ్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమై తన తండ్రి చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో పాటు తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు

By అంజి  Published on  12 Oct 2023 8:00 AM IST
Nara Lokesh, Amit Shah, YSRCP govt, APnews

'వైసీపీ సర్కార్‌ నా కుటుంబాన్ని వేధిస్తోంది'.. అమిత్‌ షాకు లోకేష్‌ ఫిర్యాదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమై తన తండ్రి చంద్రబాబును అరెస్ట్‌ చేయడంతో పాటు తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణ అనంతరం బుధవారం అమిత్ షాతో భేటీ అయిన నారా లోకేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. విచారణ పేరుతో తన తల్లి భువనేశ్వరి, ఆయన భార్య బ్రాహ్మణిలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా ఈ భేటీలో చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని అమిత్ షా లోకేశ్‌ను అడిగారు, దానికి జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో వాటి స్థితిగతుల గురించిన వివరాలను లోకేష్‌ అందించారు. 73 ఏళ్ల వృద్ధుడిని పలు కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం తగదని, చంద్రబాబు ఆరోగ్యంపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని లోకేశ్‌కు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాగా, కేంద్ర హోంమంత్రిని లోకేష్ కలవడంపై పురంధేశ్వరి తన ట్వీట్‌లో స్పందిస్తూ, నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను కొట్టిపారేయడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది.

Next Story