అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు: నారా లోకేశ్
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Sep 2023 3:45 PM GMTఅవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు: నారా లోకేశ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నారా లోకేశ్ అన్నారు. ప్రతిక్షణం చంద్రబాబు అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పారు. రాజమండ్రిలో నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంద్‌ను విజయవంతం చేసిన టీడీపీ కార్యకర్తలు, మద్దతు తెలిపిన ఇతర పార్టీలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉందని చెప్పారు. చంద్రబాబు రక్తంలో అవినీతి అనేది లేదని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో గుర్తింపు పొంది వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. బాబాయ్ హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే.. కర్నూలులో పోలీసులను అడ్డుకుపెట్టి జగన్ అడ్డుకున్నారని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో 42 సెంటర్లు ప్రారంభించి 2.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని లోకేశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకి అనుమతించింది అజయ్ కల్లంరెడ్డి.. కాని వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని లోకేశ్ ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా చంద్రబాబుకి డబ్బు ఎలా వచ్చిందో నిరూపించగలరా అని లోకేశ్ నిలదీశారు. జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదని అన్నారు. తప్పు జరగలేదు కాబట్టే వారు నిరూపించలేకపోయారని అన్నారు. విపక్షాలపై జగన్ దొంగ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని నారా లోకేశ్ హెచ్చరించారు. అయితే.. తన పోరాటం ఆగదని.. ఎన్ని కేసులైనా పెట్టుకోండంటూ సవాల్ విసిరారు. రాజమండ్రిలోనే ఉంటానని.. ఎక్కడికి పారిపోలేదని, అరెస్ట్ చేయాలనుకుంటే వచ్చి చేయండని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని... ప్రజల్లోకి వెళ్లి నిలదీస్తానని చెప్పారు. పాముకు తలలోనే విషం ఉంటుంది.. జగన్‌కు ఒళ్లంతా విషమే ఉంటుందని చెప్పారు లోకేశ్. తాను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారని చెప్పారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అందరికీ చంద్రబాబు తెలిసిన వ్యక్తి అన్నారు. పోలీసులకు చెడ్డపేరు తెచ్చేలా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ విమర్శించారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలని.. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని లోకేశ్ తెలిపారు.