నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. 'మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలు లక్ష్యంగా చేసుకునేలా ఉన్న ఈ మాటలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచేలా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి' అని హెచ్చరించారు.
శాసన సభలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. మహిళా సమాజం మరోసారి వైసీపీకి తగిన సమాధానం చెబుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రశాంతిరెడ్డి అన్నింట్లోనూ పీహెచ్‌డీ చేశారంటూ నల్లపురెడ్డి కామెంట్స్ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి రెండో పెళ్లి చేసుకుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ వర్గాలు మండిపడ్డాయి.