ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు లేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్లాలని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని నాని విమర్శించారు. గుడివాడ 10వ వార్డులో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు చెప్పకుండా పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేరని అన్నారు. వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓట్లు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి.. 60 శాతం ఓటింగ్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏం చేయగలరని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు తెగదెంపులు చేసుకోనున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరని వ్యాఖ్యానించారు. మరోవైపు కరణం ధర్మశ్రీ కూడా జనసేన అధినేత పవన్ పై పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.