అమరావతి: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి 'ముస్తాబు' కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్తు కత్తిరించుకోవాలి. జుట్టు నీట్‌గా దువ్వుకోవాలి. టాయిలెట్‌కు వెళ్లొచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారం 'ముస్తాబు స్టార్స్' పేర్లు ప్రదర్శిస్తారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో "ముస్తాబు" కార్యక్రమం జరగనుంది. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత తీసుకురావడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని 1 నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల్లో వెంటనే అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయవంతంగా అమలు చేశారు.
సత్పలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తోంది. కార్యక్రమం అమలు చేసే తీరు, విధివిధానాలు తెలియజేస్తూ వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశాలిచ్చింది. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచడం సహా క్రమశిక్షణ , మంచి వ్యక్తిత్వం అలవర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.