ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేశాక ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రఘురామ భార్య, కుమారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజు భార్య రమాదేవి మాట్లాడుతూ తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని.. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని అన్నారు. తన భర్తను అర్ధరాత్రి వేళ తీవ్రంగా కొట్టారని.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు తన భర్త ఒప్పుకోకపోవడంతో బాగా కొట్టారని చెప్పారు. అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది లేరని, కుటుంబసభ్యులం తాము కూడా లేమని, ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ జైలుకు తరలించడం వెనుక కుట్ర ఉందని భావిస్తున్నామని అన్నారు.

ఈ ఘటనలపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'జగన్ గారిని అప్రతిష్ఠ‌ పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు' అని విజ‌యసాయిరెడ్డి చెప్పారు. 'దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు' అని విజ‌యసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.


సామ్రాట్

Next Story