వకీల్ సాబ్ చిత్రంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూశానని.. అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అంతేకాదు వకీల్ సాబ్ ఫ్యాన్స్ కు పండగలా ఉంటుంది అని కితాబు ఇచ్చారు. పోలీసులు తప్పుడు కేసులు ఎలా పెడుతున్నారో వకీల్ సాబ్ లో బాగా చూపించారని రఘురామ అన్నారు. అచ్చం నాపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు తప్పుడు కేసులు మోపినట్లే ఉందని అన్నారు. అయితే.. మా వకీల్ సాబ్ కూడా పవన్ లాగే వాదించి, తప్పుడు కేసులు అని నిరూపిస్తారని నమ్ముతున్నానని రఘురామ అన్నారు.
ఇదిలావుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరోనా తర్వాత విడుదలైన కొన్ని సినిమాల టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు ఇటీవల ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి థియేటర్ యజమానులు బయటపడేందుకు రెండు రోజుల కిందట.. ఏపీ సర్కార్ ఓ ప్యాకేజీని సైతం ప్రకటించింది. టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అనుకున్నారు. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు.