నెల్లూరులోని దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ దగ్గర ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్టు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉందన్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు పనుల్లో 4 శాతం పురోగతి కనిపించిందన్నారు.
మొత్తం ఇప్పటి వరకు 36 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని తెరవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఈ ప్రాజెక్ట్ కీలకమని తెలిపారు.
అటు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు తెలంగాణలో మరిన్ని కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ''తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఇది మా ప్రాంతం అని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం.. విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తాం'' అని అన్నారు.