అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ

Money Deposited in Agrigold victims accounts.అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 7:14 AM GMT
అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ

అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో రూ.664.84 కోట్ల‌ను జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ల‌క్ష‌ల మంది ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి న‌ష్ట‌పోయార‌ని అన్నారు. ఎవ‌రూ న‌ష్ట‌పోకూడ‌ద‌ని ఇంటింటికీ వెళ్లి బాధితుల‌ను గుర్తించామ‌ని తెలిపారు. దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని.. మొత్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామ‌న్నారు.

రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3.8ల‌క్ష‌ల మంది బాధితుల‌కు రూ.207.61కోట్లు, రూ.10వేల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన 3.14ల‌క్ష‌ల మంది బాధితుల‌కు రూ.459.23కోట్లు చెల్లించామ‌ని సీఎం చెప్పారు. 2019 న‌వంబ‌రులో మొద‌టి విడుద కింద రూ.238కోట్లు చెల్లించామ‌న్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని జగన్ చెప్పారు.

2015లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారని, అగ్రిగోల్డ్ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల కోసం జరిగిన స్కామ్ అని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో గతంలో అసెంబ్లీలో చెప్పామని.. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జీవో ఇచ్చి రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు మోసాలు చేస్తూ వచ్చిందన్నారు. ఇక కోర్టు కేసులు కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూములు, ఆస్తులు అమ్ముతామ‌న్నారు. ప్ర‌భుత్వం న‌గ‌దు తీసుకుని మిగ‌తా డబ్బును డిపాజిటివ్‌దారుల‌కు అందిస్తామ‌ని చెప్పారు.

Next Story