కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరు : ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లు, దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని
By Medi Samrat Published on 13 Sep 2023 12:55 PM GMTమహిళా రిజర్వేషన్ బిల్లు, దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.
“కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం రెండు రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. నేను వాళ్లను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాలు విసిరారు. మహిళ బిల్లుపై, రైతాంగ అంశాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని నిలదీశారు.
రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరు గమ్మతిగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
“ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటున్నారు. వీళ్లు మారరా.? అప్ డేట్ కారా ? మనం మొన్ననే అన్ని పోడు పట్టాలు ఇచ్చేశాము. మళ్లీ వాళ్లు వచ్చాకనట పోడు పట్టాలు ఇస్తారటా.” అని అన్నారు. దళితులకు మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తామని దళిత డిక్లరేషన్ లో ఎక్కడైనా పెట్టారా అని నిలదీశారు. మనం దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు రూ. 12 లక్షలు ఇస్తరట, కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని మండిపడ్డారు. మనం ఏం ఇస్తుంటే దానికి ఇంకో రెండు ఎక్కువ ఇస్తామని చెప్పడం తప్పా వేరే ముచ్చట లేదని విమర్శించారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో ఇచ్చిన హామీలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్రానికి రావాలని సూచించారు. కాంగ్రెస్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయినందుకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ తిరస్కరణకు గురయ్యిందని స్పష్టం చేశారు. దేశంలో తిరస్కరించిన పార్టీని మనం నమ్ముదామా అని ప్రశ్నించారు. గతంలో ప్రతీ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమయ్యిందని చెప్పారు. ప్రజలను పీక్కతినడానికి వచ్చేవాళ్లే కాంగ్రెస్ నేతలని మండిపడ్డారు.