కరోనా సెకండ్ వేవ్ నేఫథ్యంలో ఎంతోమంది రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. తనకు వైరస్ సోకినా ఎమ్మెల్యే అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలనూ ఆదేశించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో టీకాఉత్సవ్ జరిగినా.. ఏపీలో మాత్రం వ్యాక్సిన్ నిల్వలు అయిపోవడంతో పూరిస్థాయిలో నిర్వహించలేదు. రాష్ట్రానికి సోమవారం 4.40 లక్షల కొవీషీల్డ్ డోస్‌లు అందించిన కేంద్రం.. మంగళవారం మరో 2 లక్షల కొవాగ్జిన్ డోస్‌లు కూడా పంపింది. వీటిని ఆరోగ్యశాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. మంగళవారం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈ రోజు వ్యాక్సినేషన్ మొదలయ్యింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న 6.40 లక్షల డోస్‌లను ఒక్కరోజులోనే పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ టార్గెట్ పెట్టుకుంది.