జి.కొత్త‌ప‌ల్లిలో ఉద్రిక్త‌త‌.. ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి

MLA Talari Venkatrao Attacked by G Kottapalli villagers.ఏలూరు జిల్లా ద్వార‌కా తిరుమల మండ‌లం జి.కొత్త‌ప‌ల్లిలో ఉద్రిక్త‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2022 11:25 AM IST
జి.కొత్త‌ప‌ల్లిలో ఉద్రిక్త‌త‌.. ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి

ఏలూరు జిల్లా ద్వార‌కా తిరుమల మండ‌లం జి.కొత్త‌ప‌ల్లిలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. శ‌నివారం ఉద‌యం జి.కొత్త‌ప‌ల్లిలో వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావ్ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గ్రామానికి వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఎమ్మెల్యేపై కొంద‌రు స్థానికులు దాడి చేసేందుకు య‌త్నించ‌గా.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఎమ్మెల్యేను ర‌క్షించేందుకు య‌త్నించిన పోలీసుల‌పైనా రాళ్లు రువ్విన‌ట్లు తెలుస్తోంది. దీంతో వ‌ల‌యంగా ఏర్ప‌డిన పోలీసులు ఎమ్మెల్యేను అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యేకు స్వ‌ల్ప గాయాలైన‌ట్లు తెలుస్తోంది. గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో భారీగా పోలీసుల‌ను మొహ‌రించారు.

జి.కొత్త‌ప‌ల్లిలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్యంలో గంజి ప్ర‌సాద్ దారుణ హ‌త్య‌కు గురైన‌ట్లు స‌మాచారం. అయితే.. ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందంటూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. కాగా.. గంజి ప్రసాద్ హ‌త్య‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story