ఆనందయ్యతో కలిసి ఎమ్మెల్యే కాకాణి ప్రెస్‌మీట్.. ఏం మాట్లాడారంటే..
MLA Kakani Govardhan Reddy Pressmeet. ఆనందయ్య ఆయుర్వేద మందుపై వస్తున్న వార్తలు, అపోహలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 23 May 2021 7:14 PM IST
ఆనందయ్య ఆయుర్వేద మందుపై వస్తున్న వార్తలు, అపోహలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొణిగి ఆనందయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు విశేషమైన ఆదరణ లభించడంతో.. ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారన్నారు. మందు యొక్క శాస్త్రీయతను అధ్యయనం చేయడానికి సీఎం ఆయుష్, ఐ.సీ.యం.ఆర్. బృందాలను హుటాహుటిన నెల్లూరుకి పంపించడం జరిగిందని అన్నారు. మందుపై కమిటీ సభ్యులు అధ్యయనం పూర్తి చేసి, నివేదికలు అందించిన వెంటనే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
నిపుణుల బృందం అధ్యయనం పూర్తి చేసిన తర్వాత మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పితే, మందు పంపిణీకి అడ్డంకులు తొలిగినట్లేనని.. ప్రభుత్వం నుండి అనుమతి లభించిన తర్వాత విధివిధానాలు రూపొందించి, కోవిడ్ నిబంధనలు అనుసరించి, మందు పంపిణీని చేపట్టడం జరుగుతుందని కాకాణి అన్నారు.
ఆనందయ్య తయారుచేసిన మందును ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లావ్యాప్తంగా అవసరమైన వారందరికీ పంపిణీ చేసే బాధ్యత నాదని కాకాణి తెలిపారు. ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి మందు కోసం రావడంతో కరోనా ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున దయచేసి ఎవ్వరూ సుదీర్ఘ ప్రాంతాల నుండి రావద్దని కోరారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే విధివిధానాలు రూపొందించి, కోవిడ్ మందు పంపిణీ చేపట్టడం జరుగుతుంది గనుక అప్పటి వరకు ఎవ్వరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాల్సిందిగా కాకాణి కోరారు. ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారని, రహస్య ప్రాంతాలకు తరలించారని, మీడియాలలో వస్తున్న అపోహలపై కాకాణి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.
తనను పోలీసులు అరెస్టు చేశారని, ఆనందయ్యను రహస్య ప్రాంతాలకు తరలించారని, మీడియాలలో వస్తున్న అపోహలపై ఆనందయ్య స్పందించారు. నన్ను ఎవ్వరూ నిర్బంధించలేదని.. నేను స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా తిరుగుతున్నానని ఆనందయ్యా అన్నారు. తాను అందిస్తున్న వైద్యం పట్ల ఆసక్తి కనబరిచి అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నిపుణుల బృందం నివేదిక అందించి, ప్రభుత్వం అనుమతించిన వెంటనే, మందు తయారు చేసి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆనందయ్య తెలిపారు.