టీచర్లకూ నిమిషం నిబంధన!

Minute rule for AP Govt Teachers.నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఎంసెట్ లాంటి పరీక్షలకు ఒక్క నిమిషం లేటుగా హాజరైనా ఒప్పుకోరు.

By సునీల్  Published on  17 Aug 2022 6:12 AM GMT
టీచర్లకూ నిమిషం నిబంధన!
  • ఆలస్యమైతే ఆ రోజుకు సెలవే..
  • ఏపీలో ఫేస్ అటెండెన్స్ దుమారం
  • బహిష్కరిస్తామంటున్న ఉపాధ్యాయులు
  • వేసి తీరాలంటున్న ప్రభుత్వం

నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఎంసెట్ లాంటి పరీక్షలకు ఒక్క నిమిషం లేటుగా హాజరైనా ఒప్పుకోరు. అభ్యర్థులను పరీక్ష రాయనీయకుండా వెనక్కి పంపేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పుడు అదే నిబంధన అమలు చేస్తోంది. టీచర్లు ఆలస్యంగా రాకుండా పరీక్ష పెడుతోంది. ఒక్క నిమిషం ఆలస్యంగా బడికి వచ్చినా ఆ రోజుకు ఆబ్సెంటే.

సిగ్నళ్లు అందకపోతే ఎలా?

రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్న ఏపీలో అన్ని చోట్లా ఒకే పరిస్థితులు లేవు. రవాణా సౌకర్యం లేని గ్రామాల బడులు ఉంటాయి, సెల్ ఫోన్ సిగ్నళ్లే అందని కొండ ప్రాంతాలూ ఉన్నాయి. అన్నీ అందుబాటులో ఉండే స్కూళ్లూ కనిపిస్తాయి. ఒక్కో చోట కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లాలి. మరికొన్ని చోట్ల మంచి సెంటర్లో ఉంటాయి. వీటన్నిట్లో పని చేసే టీచర్లకు ఇప్పుడు 9 గంటలకల్లా అటెండెన్స్ వేసి తీరాలనే నిబంధనే సమస్యగా మారుతోంది. చాలా చోట్ల నెట్ వర్క్ కవరేజ్ ఉండని ఏరియాలున్నాయి. అలాగే సొంత సెల్ ఫోన్లో ఫేస్ అటెండెన్స్ వేయాలనే సూచనపైనా వ్యతిరేకత వస్తోంది.

బయోమెట్రిక్ మార్చి.. ఫేస్

సర్కారీ బడుల్లో టీచర్లు, స్టూడెంట్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయోమెట్రిక్ డివైజులు స్కూళ్లకు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా బయోమెట్రిక్ వద్దు.. ఫేస్ అటెండెన్స్ వేయాల్సిందేనని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ యాప్‌లో టీచర్లు ప్రతి రోజూ సెల్ఫీ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి. ఆ తరువాత స్టూడెంట్స్ అటెండెన్స్ వేయాలి.

బహిష్కరిస్తామంటున్న యూనియన్లు

'అటెండెన్స్ కోసం డివైజులు ఇవ్వకుండా సొంత సెల్ ఫోన్లను వాడమంటున్నారు. అందరి దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉండవు. కొన్ని చోట్ల సిగ్నళ్లు ఉండవు. ఏ పరిస్థితుల్లోనైనా నిమిషం ఆలస్యంగా వస్తే ఆ రోజుకు సెలవే అంటున్నారు. సింగిల్ టీచర్ స్కూల్లో టీచర్‌కు లేటైతే బడి మూసేస్తారా?' అని ఎస్టీయూ నేతలు సాయి శ్రీనివాస్, తిమ్మన్న ప్రశ్నిస్తున్నారు. 'యాప్‌లలో హాజరు మొదలు పెట్టిన రోజే సరిగా పని చేయలేదు. ఇలాంటి పని చేయని యాప్‌లలో అటెండెన్స్, ఫొటోలు, వివరాలు నమోదు చేయడం సాధ్యమే కాద'ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ అంటున్నారు. పని చేయని యాప్‌లో, సిగ్నళ్లు లేకుండా.. నిమిషం నిబంధన అమలు చేస్తూ అటెండెన్స్ వేయాలంటే ఆ యాప్‌నే బహిష్కరిస్తామని యూనియన్లు చెబుతున్నాయి.

ఆఫ్ లైన్ ఆప్షన్ ఉంది

'సిగ్నల్ ఉన్నా, లేకపోయినా అటెండెన్స్ నమోదు చేసే అవకాశం ఉంది. ట్రయల్ రన్ కూడా చేసి చూశాం. హాజరు వేసినప్పుడే రికార్డు అవుతుంది. సిగ్నల్ వచ్చాక అప్ లోడ్ అవుతుంద'ని పాఠశాల విద్య ఉన్నతాధికారులు స్పష్టతనిస్తున్నారు. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి బొత్స స్పందిస్తూ యాప్‌లో ఫొటోలు అప్ లోడ్ చేయమంటే క్లాసులు పక్కన పెట్టడమని కాదన్నారు. పని చేస్తున్నట్లు తెలియాలంటే ఎవరైనా అటెండెన్స్ వేయాల్సిందేనన్నారు. టెక్నాలజీని తెస్తే కక్షసాధింపు అనడం సరికాదన్నారు.

Next Story