పవన్ చేస్తోంది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర: మంత్రి వేణు
పవన్ చేస్తోంది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర. ప్రాణహాని ఉందని చెప్పడం కూడా ఇదే మొదటిసారి కాదు..
By Srikanth Gundamalla Published on 19 Jun 2023 6:25 PM ISTపవన్ చేస్తోంది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర: మంత్రి వేణు
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గా మంత్రులు మాట్లాడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిస్తున్నారు. పవన్ కళ్యాణే పెద్ద రౌడీ అని.. గూండాలా మాట్లాడుతున్నారని అంటున్నారు. జనసేన పార్టీనే రౌడీల పార్టీగా వర్ణిస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పదే పదే కులాల గురించి మాట్లాడటం ఏ మాత్రం తగదని చెప్పారు. రాజకీయ పార్టీని నడుపుతూ కులాల గురించి మాట్లాడటం ఎంత వరకు సబబో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు మంత్రి వేణు. మాట్లాడితే సమాజం కోసమే అని చెప్పే పవన్ .. ఆయన మాట్లాడే తీరు బాగుందా? అని నిలదీశారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అశాంతి నెలకొల్పేలా గూండాలా వ్యవహరిస్తున్నారని మంత్రి వేణు మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతో మంది వచ్చి వెళ్లిపోయారని అన్నారు. వారి పవన్ కళ్యాణ్ సంగతేంటో చెప్పాలన్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట లేరని అర్థమైందని. 2019 ఎన్నికల్లోనే అది నిరూపితం అయ్యిందన్నారు. అయితే.. ఈసారి కూడా ఆయనకు ఓటమి తప్పదని మంత్రి వేణు జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై పవన్ పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు. సమాజంలో సముచిత స్థానం ఉన్న వ్యక్తి ద్వారంపూడి.. అలాంటి వ్యక్తిని విమర్శిస్తే మీకే మంచిది కాదన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టింది తన కోసం కాదని.. చంద్రబాబు కోసమే అన్నారు. అది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర అని మంత్రి విమర్శించారు. ప్రాణహాని ఉందని పవన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు.. 2018లోనూ ఇలానే మాట్లాడారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్‌వి అన్నీ డ్రామా రాజకీయాలని మంత్రి వేణు కొట్టిపారేశారు. ఎవరు ఏంటనేది ప్రజా తీర్పుతోనే తేలుందని అన్నారు.