ఏపీ హోంమంత్రి తానేటి వనిత లోన్ యాప్స్ చేస్తున్న దుర్మార్గాలపై సీరియస్ అయ్యారు. తెలియక కొందరు లోన్ యాప్‌కు ఆకర్షితులవుతున్నారని.. లోన్ యాప్ ఏజెంట్లు బాధితుల మొబైల్ డేటాను తీసుకుని వేధించడం నేరమన్నారు. లోన్ యాప్ వేధింపుల వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని.. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తానేటి వనిత వెల్లడించారు. లోన్‌ల పేరుతో ప్రజా ప్రతినిధులను సైతం వేధిస్తున్నారని అన్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లకు కూడా లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే..!
అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసిన ఓ ఏజెంట్.. మీరు తీసుకున్న 8 లక్షల రూపాయల అప్పును తీర్చాలంటూ అడిగాడు. నేనే అప్పు తీసుకోలేదని అనిల్ కుమార్ చెప్పారు. ఇంకోసారి డబ్బులు తీసుకున్నాను అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఇక లోన్ యాప్స్ ఆగడాలు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే..! వాటన్నిటిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్‌ను కొన్ని సంస్థల నుంచి సేకరిస్తున్నారని అన్నారు. కొన్ని ఫోన్ కాల్స్ అజ్ఞాతం నుంచి వస్తున్నాయని.. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్ నిర్వాహకులపై నిఘా పెట్టామని ఆయన చెప్పారు.