వైఎస్సార్ నరరూప రాక్షసుడు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Minister Srinivas Goud fires on YSR.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2021 2:07 PM ISTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఒక నరరూప రాక్షసుడని, ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఊసరవెల్లి అని మంత్రి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వెనుకబాటు తనానికి కూడా వైఎస్సారే కారణమని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైఎస్సారే కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు.
తండ్రి తప్పు చేసినా కొడుకు (వైయస్ జగన్) మంచి చేస్తాడని అనుకున్నామని, కానీ..మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయని విమర్శించారు. వైయస్ కడుపులో పుట్టినా అదే పద్ధతిలో జగన్ ఉంటాడని అనుకోలేదని.. మనుషుల్లో మార్పు వస్తుందని అనుకున్నామని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. కానీ జగన్ తీరు కూడా దారుణంగా ఉందన్నారు. నిన్నటి వరకు మంచితనం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ఊసరవెల్లిలా మారారని మండిపడ్డారు.
రాజశేఖర్ రెడ్డిని దొంగ అనగానే వైసీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణకు అడుగడుగున వైయస్ నష్టం చేశాడన్నారు. దోచుకుపోయినవాడిని దొంగ అనకపోతే ఇంకేమనాలని ప్రశ్నించారు. గతంలో వైయస్ దోచుకుపోయాడని, ఇప్పుడు ఆయన కొడుకు జగన్ దోచుకుపోతున్నాడని ఆరోపించారు. అందుకే దొంగ, గజదొంగ అని అంటున్నామని చెప్పారు. మమ్మల్ని దోచుకుంటే మాకు కడుపు మండదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ అన్నోళ్లందరినీ నక్సలైట్ల పేరు మీద చంపించిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న గద్దరన్నపై కూడా నాటి ఆంధ్రా పాలకులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మందిని బలితీసుకున్నారు. తెలంగాణ పదం ఉచ్ఛరించిన కాంగ్రెస్ నాయకులను కూడా వైఎస్సార్ ఇబ్బంది పెట్టి.. మానసిక క్షోభకు గురి చేశారు. పోతిరెడ్డిపాడు కోసం దివంగత పీజేఆర్ కొట్లాడారని..ఆ తర్వాత ఏం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీజేఆర్ చావుకు వైయస్సార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. పీజేఆర్ ను వైయస్ ఎంతో క్షోభ పెట్టాడని మండిపడ్దారు.
తెలంగాణ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి తీయకుండా, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద వేల కోట్ల రూపాయాలు ఆంధ్రా పాలకులు ఎత్తుకుపోయారు అని ధ్వజమెత్తారు. తెలంగాణకు వైఎస్సార్ చేసిందేమీ లేదు. తెలంగాణలో ఏ కులవృత్తిని కూడా ఎదగనీయలేదన్నారు.
మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయన్నారు. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.