చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు

చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి
Published on : 14 Jun 2025 7:10 AM IST

Minister Savitha, wages, handloom workers, APnews

చేనేత కార్మికులకు శుభవార్త

అమరావతి: చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలను పెంచుతున్నట్టు రాష్ట్ర బీసీ, చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి సవిత తెలిపారు. శుక్రవారం నాడు అమరావతి సచివాలయంలో మంత్రి మాట్లాడారు. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే సహకార సంఘాల్లో పని చేసే చేనేత కార్మికుల వేతనాలను రూ.3 వేల చొప్పున పెంచుతున్నట్టు మంత్రి సవిత వెల్లడించారు. అలాగే ప్రాసెసింగ్‌ ఛార్జీల్లోనూ పెంపు ఉంటుందన్నారు. దీంతో బ్లీచింగ్‌ ఛార్జీలు బండిల్‌కు రూ.129 నుంచి రూ.148కి, డైయింగ్‌కు రూ.362 నుంచి రూ.434కు, బెడ్‌షీట్‌ నేత మజూరి రూ.83 నుంచి రూ.100కు, టవల్‌ నేత మజూరి రూ.31 నుంచి రూ.40కి పెరగనున్నాయి.

ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మిక సహకార సంఘాల కింద పని చేసే నేత కార్మికులకు వేతనాలు, చార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఇచ్చిన హామీ ప్రకారం.. చేనేతలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీని నిలపెట్టుకునేలా ప్రతి నెలా రూ.4 వేల చొప్పున 92,274 మంది నేతన్నలకు పింఛను అందజేస్తున్నామన్నారు. మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఫ్రీగా ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా కొత్త డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

Next Story