Andhrapradesh: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందజేయనున్నట్లు...

By -  అంజి
Published on : 28 Nov 2025 7:02 AM IST

Minister Savita, free civils coaching , BC students, Andhrapradesh

Andhrapradesh: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత సివిల్స్‌ కోచింగ్‌ 

అమరావతి: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కోసం తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, బీసీ బిడ్డల ఉన్నత స్థానాల్లో నిలవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండో విడత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వంద మంది అభ్యర్థులకు శిక్షణిచ్చేలా గొల్లపూడి బీసీ భవన్ లో ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ దరఖాస్తుల స్వీరించనున్నామని, ఏడో తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. 11వ తేదీన అర్హత పరీక్ష ఉత్తీర్ణతా ఫలితాలు ప్రకటించి, 14వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు12 వ తేదీన గొల్లపూడిలోని బీసీ భవన్ లో రిపోర్టు చేయాలని తెలిపారు. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన బీసీ అభ్యర్థులు ఉచిత సివిల్స్ శిక్షణకు అర్హులన్నారు.

గతేడాది ఉచిత శిక్షణ పొందిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవొచ్చునని తెలిపారు. ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించే ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ శిక్షణకు బీసీ అభ్యర్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకూ అవకాశమిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 100 సీట్లలో బీసీలకు 66 సీట్లు, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, అడిషనల్ డైరెక్టర్ రామచంద్రరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story