వైఎస్ జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్య కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. నిర్మాణం పూర్తి కాకుండానే గత సంవత్సరం కొన్ని కాలేజీలు ప్రారంభించారని అన్నారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు లేవని అన్నారు. పులివెందుల కాలేజీలో 48 శాతం బోధనా సిబ్బంది లేరని, గదులు లేవని, విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలి? పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెబుతారా ప్రొఫెసర్ జగన్ అని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఇలాంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వపరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని, ఎన్‌ఎంసీ ఇస్తామన్న ఎంబీబీఎస్ సీట్లు వద్దన్న సత్యకుమార్ లాంటి ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడైనా ఉంటారా? అని వైసీపీ విమర్శలపై ఆయన స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే ప్రజలు మీకు 151 నుండి 11 కు దించారని అన్నారు. జగన్ ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని.. లేదంటే ప్రజలు బెంగుళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు.