అమరావతి:- అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయాడనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణం అని సంబంధిత అధికారులు చెపుతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలన్నారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి.సంధ్యారాణి హెచ్చరించారు