విద్యాదీవెనతో చంద్రబాబు, పవన్‌కు చదువు చెప్పించాలి: రోజా
ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 7:45 AM GMTవిద్యాదీవెనతో చంద్రబాబు, పవన్‌కు చదువు చెప్పించాలి: రోజా
ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు తాను ఏ గ్రూప్ చదివారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇక బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. వీరిద్దరికి చదువు గురించి కనీస నాలెడ్జ్ లేదంటూ విమర్శలు చేశారు రోజా. పవన్, చంద్రబాబులకు విద్యాకానుక ఇవ్వాలని.. విద్యాదీవెనతో చంద్రబాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న ఈ రెండు పార్టీల ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తున్నారనీ.. అలాగే జనసేనను నమ్ముకున్నవారంతా రిలీజ్ సినిమాలకు వెళ్తున్నారని చెప్పారు. అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తున్నారని మంత్రి రోజా అన్నారు.
ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా నగరికి వెళ్లారు. అక్కడ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.680 కోట్లను రిలీజ్ చేశారు సీఎం జగన్. నగరికి సీఎం పదవిలో తొలిసారి వచ్చిన జగన్‌కు మంత్రి రోజా అభినందనలు తెలిపారు. జగన్ నగరి నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. నాణ్యమైన విద్యను ప్రతి పేదవాడికి ఆస్తిగా అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆమె కొనియాడారు. చదువుకు కులం, మతం, ప్రాంత బేధాలు ఉండవని సీఎం జగన్ నిరూపించారని మంత్రి రోజా పేర్కొన్నారు.
విద్యారంగంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని రోజా అన్నారు. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని ఆమె పేర్కొన్నారు. విద్యా దీవెన, వంసతి పథకాలు ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదని చెప్పారు. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు దేశ ప్రధాని ప్రశంసించారని మంత్రి రోజా గుర్తు చేశారు.