వైసీపీ తరిమేసిన వారిని టీడీపీ అభ్యర్థులుగా పెట్టుకుంటోంది: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 3:14 PM ISTవైసీపీ తరిమేసిన వారిని టీడీపీ అభ్యర్థులుగా పెట్టుకుంటోంది: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి. సిద్ధం పేరుతో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక రా.. కదలిరా పేరుతో టీడీపీ.. మేమూ సంసిద్ధం అంటూ జనసేన ఎన్నికలకు వెళ్తున్నారు. ఇక మరోవైపు ఇటీవలే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల తనదైన శైలిలో అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా మంత్రి ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై ఫైర్ అయ్యారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పుత్తూరు మండలంలో మంత్రి రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కానీ.. ఆమె టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారంటూ విమర్శలు చేశారు.
చంద్రబాబు గతంలో మూడుసార్లు సీఎంగా చేశారనీ.. ఆయన పనిచేసిన సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని ప్రశ్నించారు మంత్రి రోజా. హామీలను అన్నింటిని నెరవేర్చకుండా.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారనీ అన్నారు. మరోసారి ఎలా అధికారం కావాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారని అన్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు... ఆనాడు చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేశారనీ.. ఇప్పుడు వైఎస్సార్ కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తోన్నారని అన్నారు. చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలు గమనించాలని.. అలాంటి అవకాశం మరోసారి ఇవ్వొద్దని అన్నారు మంత్రి రోజా. చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అభ్యర్తులు కూడా దొరకడం లేదనీ.. వైసీపీ నుంచి తరిమేసిన నాయకులకు టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ ఆత్మ క్షభించేలా వైఎస్ షర్మిల వ్యవహారం ఉందని మంత్రి రోజా అన్నారు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి ఏం మాట్లాడారో చూశామనీ.. ఇప్పుడు ఆంధ్రాలో అబద్దాలు మొదలుపెట్టారని అన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ చెప్పారు. నగరిలో అభివృద్ధి ఎంతో చేశామనీ.. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రిరోజా అన్నారు.