ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మంత్రి రోజా ఏమన్నారంటే.?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు.

By అంజి  Published on  26 Feb 2023 4:45 PM IST
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మంత్రి రోజా ఏమన్నారంటే.?

చిత్తూరు: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబ సభ్యులను మాత్రమే నారా కుటుంబం వాడుకుంటోందని విమర్శించారు. నందమూరి కుటుంబ సభ్యులను చంద్రబాబు కూర గాయలుగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. నందమూరి కుటుంబ సభ్యులు నారా కుటుంబంతో జతకట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

2014లో చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను గ్యాలరీలో ఒక మూల కూర్చోబెట్టి అవమానించారని ఆరోపించిన సంఘటనను కూడా ఆమె ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్‌కు ఆదరణ కల్పించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. తాత సీనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణలు ఎదుర్కొన్న అవమానాలను జూనియర్ ఎన్టీఆర్ మరిచిపోలేరని ఆమె అన్నారు. అంతేకాకుండా లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవ్వడంతో వారాహితో పవన్ కళ్యాణ్ ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలని టీడీపీ యోచిస్తోందని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

''పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేశ్ తీరు ఉంది. లోకేశ్ తన స్ధాయి మరిచి మాట్లాడుతున్నాడు. మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేశ్ తిరుగుతాడా? చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయాలి. మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆధారాలతో రా లోకేశ్. నీ పాదయాత్రకు జనాలు లేరు. చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ ఛార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్లది'' అంటూ మంత్రి రోజా హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Next Story