విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీలు విధించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ చార్జీల్లో కూడా ఎలాంటి పెంపు లేదని తెలిపారు.
సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని అన్నారు. అదే విధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా చార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.