ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ ప్రచారంపై పేర్ని నాని క్లారిటీ

Minister perni nani clarity on corona new strain.ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం శక్తికి మించి అహర్నిశలు పనిచేస్తోందని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 9:46 AM GMT
Minister perni nani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్ వచ్చిందని.. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కొత్తగా వచ్చిన 'వైరస్ ఎన్ 440కె' కారణమనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కొత్త కరోనా వైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొన్నారనే వార్తలు వచ్చాయి. విశాఖపట్నం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వేరియంట్ విజృంభిస్తోందని చెబుతున్నారు.

కరోనా వేరియంట్లలో భారతీయ వేరియంట్ B1.617, B1.618 వేరియంట్ల కంటే ప్రమాదకరంగా ఉండవచ్చునని అంటున్నారు. ఈ ఏపీ స్ట్రెయిన్ ఎంత ప్రాణాంతకమో ఇంకా నిర్ధారించాల్సి ఉంది. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని.. కరోనాకు చెందిన ఇతర వైరస్‌ల కంటే కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు.

ఈ వదంతులపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం శక్తికి మించి అహర్నిశలు పనిచేస్తోందని.. కానీ, చంద్రబాబు నాయుడు కరోనాపై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త వైరస్ ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్440కే వైరస్ వ్యాప్తిపై ఎలాంటి నిర్ధారణ జరగలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దేశంలో బి.1.617 మినహా కొత్త రకం వైరస్ ఎక్కడా లేదని.. బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్ల నియంత్రణ ఎవరి చేతుల్లో ఉందో చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండు విడతలు కలిపి 67,42,700 మందికి వ్యాక్సిన్ వేశామని వివరించారు. కేంద్రం సమృద్ధిగా ఇస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలమని అన్నారు.

ఇక క‌రోనా నియంత్ర‌ణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న ప్ర‌భుత్వం అఫిడవిట్‌లో పేర్కొంద‌ని, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో వివ‌రించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అసంతృప్తి వ్య‌క్తం చేసింది.


Next Story