'నీ అబద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం'.. వైఎస్ జగన్‌పై మంత్రి లోకేష్ ఆన్‌ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన హయాంలో ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
By అంజి
'నీ అబద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం'.. వైఎస్ జగన్‌పై మంత్రి లోకేష్ ఆన్‌ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన హయాంలో ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. స్త్రీ శక్తి పథకం కింద లబ్ధిదారులకు పసుపు రంగు కుట్టుమిషన్లను పంపిణీ చేశారన్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ విమర్శలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీఎస్ మంత్రి నారా లోకేష్ శనివారం తోసిపుచ్చారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన లోకేష్, తన తాత ఎన్టీఆర్, తండ్రి ఎన్. చంద్రబాబు నాయుడు నుండి మహిళా సాధికారత స్ఫూర్తిని వారసత్వంగా పొందానని పేర్కొన్నారు. తన తల్లి భువనేశ్వరి ఆశీస్సులు, భార్య బ్రాహ్మణి ప్రోత్సాహంతో, ఆయన 2022 జూన్ 20న మంగళగిరి నియోజకవర్గంలో మొదటి స్త్రీ శక్తి కేంద్రాన్ని ప్రారంభించానని లోకేష్ చెప్పారు.
మంత్రి నారా లోకేష్ మాటల్లో..
''అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరువ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల,మత అంతరాలు పాటించకుండా...తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాదిమందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేశాను. మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022, జూన్20 ప్రారంభించాం.
ఈ కేంద్రం ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్షణ పూర్తిచేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశాం. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీ శక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసి, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం. ఇవన్నీ నా జేబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే... శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా (వైఎస్ జగన్) పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం''