అమరావతి: మెగా డీఎస్సీపై ప్రశ్న సంధించి శాసనసభకు వైసీపీ సభ్యులు గైర్హాజరవడం చర్చనీయాశంమైంది. అయితే వైసీపీ సభ్యులు హాజరుకాకపోయినా సమాధానం ఇస్తానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. మన బడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద రూ.3 వేల కోట్లతో స్కూళ్లకు ప్రహారీలు నిర్మిస్తామని చెప్పారు. మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళికలు చేపట్టామని తెలిపారు.
నాడు - నేడుపై రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ తీసుకుంటామన్నారు. అన్ని విద్యా సంస్థల్లో 'డ్రగ్స్ వద్దు బ్రో' క్యాంపెయిన్‌ను చేపట్టామన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ఈగల్ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ విధానాలతో పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు. గత 30 ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశామన్నారు.