శుభవార్త చెప్పిన మంత్రి లోకేశ్..2 వేల మందికి త్వరలోనే ఇళ్లపట్టాలు
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik
శుభవార్త చెప్పిన మంత్రి లోకేశ్..2 వేల మందికి త్వరలోనే ఇళ్లపట్టాలు
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2వేలమంది ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... గతంలో 3 వేలమందికి సుమారు వెయ్యికోట్ల విలువైన ఇళ్లపట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2వేలు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థలసేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిడ్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్య తీసుకోవాలని సూచించారు. ఎంటిఎంసి పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్, ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.